ఎమ్మిగనూరు నియోజకవర్గంలో లోకేష్ అపూర్వస్వాగతం యువనేతపై పూలవర్షం… హారతులతో మహిళల నీరాజనాలు యువనేతను చూసేందుకు రోడ్ల వెంట బారులుతీరిన జనం జోరువానలోనూ పాదయాత్రను కొనసాగించిన యువనేత
ఎమ్మిగనూరు: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 83వరోజు (శుక్రవారం) ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. ఎమ్మిగనూరు ఇన్ చార్జి బివి జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు ఇబ్రహీంపురం శివార్లలో ఘనస్వాగతం పలికారు. భారీగజమాలలు, మేళతాళాలతో యువనేతను స్వాగతించారు. దారిపొడవున యువనేతపై పూలవర్షం కురిపించి బాణాసంచా మోతలతో హోరెత్తించారు. అడుగడుగునా యువనేతకు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మధ్యాహ్నం భోజన విరామానంతరం హోరువర్షంలోనూ యువనేత పాదయాత్ర కొనసాగించారు. పాదయాత్ర ఎమ్మిగనూరు నియోజకర్గం మాచాపురం శివార్లకు చేరుకోగానే కుండపోత వర్షం కురిసింది. గొడుగును సైతం తిరస్కరించి వర్షంలోనే యువనేత యాత్రను కొనసాగించారు. కొద్దిసేపు ఆగాలన్న నాయకుల విజ్జప్తిని తిరస్కరించారు. దాంతో నాయకులు, కార్యకర్తలు వర్షంలోనే యువనేతను అనుసరించారు. లోకేష్ తోపాటు తడిసి ముద్దయిన యువగళం బృందాలు, వాలంటీర్లు, అభిమానులు తడిసి ముద్దయ్యారు. వర్షం కురుస్తున్నా లోకేష్ ని చూసేందుకు మాచాపురం గ్రామంలో భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. మండల కేంద్రం నందవరంలో భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చి యువనేతను స్వాగతించారు. లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు, చిన్నపిల్లలు రోడ్లపైకి వచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భోజన విరామానికి ముందు ఇబ్రహీంపురం శివార్లలో అకాలవర్షాల కారణంగా తడిచిపోయిన మిర్చి కళ్లాలను పరిశీలించిన యువనేత అక్కడి రైతుల కష్టాలు తెలుసుకున్నారు. తర్వాత రైతు కూలీలతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మాచాపురంలో రైతులతో సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. సాయంత్రం నందవరం రైతులు, దళితులు యువనేతను కలిసి తమ సమస్యలను తెలియజేశారు. మండువేసవిలో సైతం దారిపొడవునా జనం యువనేతకు వేచిచూసి తమ బాధలు చెప్పకున్నారు. అనంతరం యువగళం పాదయాత్ర నందవరం శివారులోని విడిది కేంద్రానికి చేరుకుంది. 83వరోజు యువనేత లోకేష్ 14.2 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు 1073.9 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు.
పొలంసాకుతో పెన్షన్ తీసేశారు! -సరస్వతి, ఇబ్రహీంపురం కొట్టాల.
నా కొడుకు రామాంజనేయులుకు చిన్నప్పటి నుంచి రెండుకాళ్లు, చేతులు పనిచేయవు. రూ.200 పెన్షన్ అప్పటినుంచి నాలుగునెలల క్రితం వరకు వికలాంగుల పెన్షన్ వచ్చేది. తండ్రి పేరుమీద పొలం ఉందని పెన్షన్ తీసేశారు. నా కొడుకు కనీసం అన్నం తినాలన్న మేం సాయం చేయాలి. అటువంటి వాడికి అన్యాయంగా పెన్షన్ తీసేశారు. వాలంటీర్ ను అడిగితే పొంతనలేని సమాధానం చెబుతున్నాడు.
ఆ స్టిక్కర్లు మీ మొఖాలకు వేసుకోండి?!
సీమప్రజలకు గుక్కెడు నీళ్లివ్వడం చేతగాని వైసీపీ గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన పథకాలకు మాత్రం సిగ్గులేకుండా స్టిక్కర్లు, రంగులు వేసుకుంటున్నారని యువనేత Nara Lokesh తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇబ్రహీంపురంలో ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందించేందుకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద గత ప్రభుత్వం మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటుచేసింది. ఈ పథకానికి నీరు అందించడం చేతగాక పాడుబెట్టిన వైసిపి నేతలు స్టిక్కర్ మాత్రం వేసుకున్నారు. ఎవరికో పుట్టిన బిడ్డలను తమ బిడ్డలని చెప్పుకోవడం అలవాటు అయ్యిన వాళ్ళు ఖాళీ ఖజనాతో చేయగలిగింది ఏముంది?
ధరల స్థిరీకరణ నిధి ఏమైంది?
జగన్ చెప్పిన రూ.3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఎం అయ్యింది. రూ.12,500 రైతు భరోసా అన్న జగన్ ఇప్పుడు 7,500 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఒక్కో రైతు దగ్గర నుండి రూ.25 వేలు కొట్టేసాడు జగన్. జగన్ పాలనలో ఆర్బీకే సెంటర్లు ఒక బోగస్. వాటి ద్వారా ఒక్క రైతుకి కూడా సాయం అందలేదు. మిర్చి, టొమాటో, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం తో పాటు TDP అధికారంలోకి వచ్చిన వెంటనే కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తాం. రాయలసీమ లో మామిడి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. మొదటి మూడు ఏళ్లలో సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. టిడిపి హయాంలో రూ.1986 కోట్ల తో ప్రారంభించిన ఆర్డీఎస్ రైట్ కెనాల్ పనులు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తాం. ఎల్ ఎల్ సి ఆధునీకరణ పనులు పూర్తి చేస్తాం. రాయలసీమ ను హార్టి కల్చర్ హబ్ గా మారుస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సబ్సిడీ లో డ్రిప్ ఇరిగేషన్. అందిస్తాం.
రైతులు మాట్లాడుతూ…
నకిలీ విత్తనాల కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయాం. దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోయింది. భూ సర్వే పేరుతో వైసిపి ప్రభుత్వం వేధిస్తోందని రైతు నాగన్న చెప్పాడు. 12 ఎకరాలు కౌలు కి తీసుకొని పంట వేస్తే నష్టం వచ్చి భర్త అంజనయ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని రంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నో ఏళ్లుగా మా ఆధీనంలో ఉన్న భూమి ప్రభుత్వం లాక్కుంది. మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం. పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అమ్ముకోవడం కోసం యార్డ్ లేక ఇబ్బంది పడుతున్నామని పలువురు రైతులు వాపోయారు.
రైతుల ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు:
కురువ రంగమ్మ, నెరుడుప్పల గ్రామం : అప్పులపాలవ్వడంతో నా భర్త అంజనయ్య ఏడాదిన్నర క్రితం పురుగులమందు తాగి చనిపోయాడు. 12 ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప, ఉల్లి సాగు చేశాం. రెండేళ్లలో 32 లక్షల నష్టం వచ్చింది. గ్రామంలో వారంతా అప్పులు తీర్చాలని ఒత్తిడి చేస్తున్నారు. ఊర్లో కూడా ఉండటం లేదు. ఉండటానికి సొంతిళ్లు కూడా లేదు. ప్రభుత్వం నుండి ఇప్పటికీ పరిహారం రాలేదు.
బోయ శ్రీనివాసులు, బాపురం గ్రామం: పత్తిసాగు చేసి చాలా నష్టపోయా. గతంలో ఎకరాకు 15 క్వింటాళ్ల పత్తి వచ్చేది..ఇప్పుడు 2 క్వింటాలు కూడా రావడం లేదు. నకిలీ విత్తనాల సరఫరాను నిర్మూలించాలి.
పూజారి నాగప్ప : నాలుగేళ్లుగా భూ సమస్య పరిష్కారం కోసం ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. మాతో కాదు..ఈ భూమి మీది కాదు అని ఎమ్మార్వో అన్నారు. భూమికి సంబంధించిన రికార్డులు నేను తీసుకొస్తానని చెప్పాను. అయినా మా పొలాన్ని ఆన్ లైన్ లో పెట్టడం లేదు. రీ సర్వే పేరుతో ప్రభుత్వం వేధిస్తోంది.
రంగన్న, జగ్గాపురం గ్రామం: మిర్చి మొదటి కోత విక్రయించా..కూలీలకు కూడా లేదు. రెండో పంట కల్లంలో ఉంది. క్వింటా 12 వేలకు అడుగుతున్నారు.
కృష్ణమూర్తి, కొట్టాల గ్రామం: మా బోరుకు మీటరు బిగించారు. విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తోంది..కట్టలేకపోతున్నాను.
జె.బ్రహ్మానందరెడ్డి, ఇబ్రహీంపురం కొట్టాల గ్రామం : సాగునీటి చెరువులను అధ్యయనం చేసి సాగునీరు ఇస్తే రైతులు బాగుపడతారు. బ్యాంకులు సకాలంలో రుణాలు ఇవ్వడం లేదు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. వడ్డీరాయితీ లక్ష మాత్రమే ఇస్తున్నారు.
మహేంద్ర రెడ్డి : నేను 12 ఎకరాలు పత్తివేశా. కానీ ఎకరాకు 5 కేజీలు కూడా రావడం లేదు. తాడేపల్లిలో జగన్ ఏసీలో ఉంటే మేము పనులు చేసుకుని జీవిస్తున్నాం. యూరియా గతంలో 12 వందలు ఉంటే ఇప్పడు రూ.2 వేల దాకా ఉంటుంది. మా సమస్యలు పరిష్కరించండి.
అకాలవర్షాలతో నష్టపోయిన రైతులకు లోకేష్ పరామర్శ
ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇబ్రహీంపురంలో అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులను యువనేత లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా మిర్చి కళ్ళంలోకి వెళ్లి రైతులు భీమయ్య, నాగేంద్ర, రైతు కూలీలతో యువనేత లోకేష్ మాట్లాడారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని లోకేష్ వద్ద మిర్చి రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం పంట నష్టం అంచనా వెయ్యడానికి కూడా ఎవరూ రాలేదని రైతులు వాపోయారు. విత్తనం వేసిన దగ్గర నుండి పంట తీసే వరకూ ఎకరానికి రెండు లక్షల ఖర్చు వస్తుంది. వైసిపి ప్రభుత్వ వచ్చిన తరువాత విత్తనం, ఎరువులు, పురుగుల మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. విత్తనం ప్యాకెట్ ధర గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రూ.150 వరకూ పెరిగింది, పురుగు మందు డబ్బా రూ.400 పెరిగింది. నల్ల తామర, గజ్జి ముడత తెగుళ్లతో పంట దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి రావడం కష్టంగా మారింది. క్వింటా మిర్చి రూ.15 వేలు పలుకుతుంది. తడిసిన మిర్చి క్వింటా రూ.8 వేలు కూడా రావడం లేదు. ఎకరాకు 30 నుండి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే తప్ప గిట్టుబాటు కాదు. ప్రకృతి సహకరించి క్వింటా రూ.20 వేలు వస్తేనే రైతు కి లాభం వస్తుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్సిడీ ధరకే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందజేయాలి. పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చెయ్యాలి. మిర్చి అమ్ముకోవడానికి గుంటూరు వెళ్లాల్సి వస్తుంది. దీని వలన ట్రాన్స్ పోర్ట్ ఖర్చు పెరిగి తీవ్రంగా నష్టపోతున్నాం. జిల్లాలో మిర్చి యార్డ్ ఏర్పాటు చేయాలని యువనేతను కోరిన రైతులు.
*యువనేత లోకేష్ మాట్లాడుతూ…*
సిఎం కి రైతుల కష్టాలు కనపడవు. అకాల వర్షాల కారణంగా మిర్చి, మామిడి, వరి రైతులు తీవ్రంగా నష్టపోతే సిఎం జగన్ కి కనీసం సమీక్ష చేసే ఖాళీ లేదు.పంట నష్టం అంచనా వేసే దిక్కు లేదు. టిడిపి హయాంలో విత్తనాలు, ఎరువులు, మందులు సబ్సిడీ ధరకు అందించాం. మిర్చి రైతులు తరచూ తీవ్రంగా నష్టపోతున్నారు. మిర్చి పంటకు వస్తున్న తెగుళ్లతో పెట్టుబడి వ్యయం రెండితలు పెరిగిపోయింది. అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి, ఇతర పంటల రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. తడిచి రంగు మారిన మిర్చిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఉదారంగా ఆదుకోవాలి. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల మాఫియా రాజ్యమేలుతుంది. రైతు రాజ్యం తెస్తానని పరదాల సిఎం రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సబ్సిడీ ధరకు అందజేస్తాం. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు అమ్మే కంపెనీల పై చర్యలు తీసుకుంటాం. ఇక్కడి రైతులు మిర్చి అమ్ముకోవడానికి కర్నాటక, గుంటూరు వెళ్లాల్సి రావడంతో రైతులపై భారం పడుతోంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదోనిలో మిర్చి యార్డు, కోల్డ్ స్టోరేజి ఏర్పాటుచేస్తాం.
మహిళా రైతు కూలీల కష్టాలు విన్న లోకేష్
ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇబ్రహీంపురంలో మహిళా రైతుకూలీలతో మాట్లాడిన లోకేష్… వారి సమస్యలను తెలుసుకున్నారు. రోజుకి రూ.250 కూలీ వస్తుంది. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల భారంతో బ్రతకడం కష్టంగా మారింది. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. టిడిపి హయాంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల ప్లాంట్ నిర్వహణ ను వైసిపి ప్రభుత్వం గాలికి వదిలేసింది. డ్రైనేజ్ వ్యవస్థ లేక అనారోగ్యం బారిన పడుతున్నాం. సాగు నీరు లేక వ్యవసాయ పనులు కూడా ఉండటం లేదు. ఎంతోమంది గ్రామాన్ని వదిలి పనుల కోసం వలస పోతున్నారు అంటూ లోకేష్ వద్ద మహిళా రైతు కూలీలు ఆవేదన వ్యక్తంచేశారు.
యువనేత లోకేష్ మాట్లాడుతూ…
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సాగు నీటి ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసి స్థానికంగా వ్యవసాయ పనులు దొరికేలా చేస్తాం. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం.ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ద్వారా నీరు అందిస్తాం. వైసిపి ప్రభుత్వం రద్దు చేసిన ఎన్టీఆర్ సుజల కార్యక్రమం తిరిగి ప్రారంభిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల భారం తగ్గిస్తాం.
యువనేతను కలిసిన కల్లుదేవకుంట గ్రామస్తులు
మంత్రాలయం నియోజకవర్గం కల్లుదేవకుంట గ్రామస్తులు యువనేత నారా లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. గ్రామంలో ప్రస్తుతం ఉన్న సిమెంటు రోడ్లు మీ హయాంలో నిర్మించినవేనని యువనేతకు చూపి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. మా గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్ మంజూరు చేయాలి. సాగునీటి సమస్య పరిష్కారానికి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలి. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటుచేయాలి. పిహెచ్ సిలో డాక్టర్, రెగ్యులర్ స్టాఫ్ ను నియమించాలి.
*యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…*
ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక గ్రామసీమలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గ్రామపంచాయితీలకు చెందిన రూ.8660 కోట్లు దొంగిలించారు. నేను పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్నపుడు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మించాను. టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి ఇంటింటికీ తాగునీరు అందిస్తాం. గ్రామంలో డ్రైనేజి, ఇతర సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తాం.
యువనేతను కలిసిన ఇబ్రహీంపురం గ్రామస్తులు
ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇబ్రహీంపురం గ్రామస్తులు యువనేత నారా లోకేష్ ను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. పక్కా ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు ఇవ్వకుండా వైసిపి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఆర్ డిఎస్ కుడికాల్వను మా గ్రామానికి విస్తరించి సాగు, తాగునీటి సమస్య పరిష్కరించాలని నిర్ణయించారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక మా ప్రాతానికి ఆర్ డిఎస్ కాల్వ రాకుండా అడ్డుపడ్డారు. గతంలో గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ద్వారా గతంలో మా పొలాలకు నీరందేది. ఇప్పుడు ఆ నీటిని కూడా రాకుండా చేశారు. మాధవరం మండలంతోపాటు మా గ్రామ సాగునీటి సమస్య పరిష్కారానికి ఆర్ డిఎస్ కుడికాల్వను విస్తరించాల్సిందిగా కోరుతున్నాం.
*యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ…*
రాష్ట్రంలో ప్రజలెవరూ ప్రశాంతంగా జీవించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. 30లక్షల ఇళ్లు కడతానని చెప్పి నాలుగేళ్లలో 5 ఇళ్లు మాత్రమే కట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కూడా జగన్ ఇతర పథకాలకు మళ్లిస్తున్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్న ఇళ్ల బిల్లలన్నీ చెల్లిస్తాం. ఆర్ డిఎస్ కాల్వను విస్తరించి ఇబ్రహీంపురం గ్రామస్తులు తాగు, సాగునీటి సమస్యను పరిష్కరిస్తాం.
యువనేతను కలిసిన మాచాపురం, నడకైరవాడ గ్రామస్తులు
2009లో నడికైరవాడి గ్రామం వరదకు ముంపునకు గురైంది. వరద కారణంగా మా ఇళ్లన్నీ పాడైపోయాయి. కొందరి స్వార్థపూరిత ఆలోచనల కారణంగా మాకు ఇళ్లస్థలాలు కేటాయించలేదు. ప్రస్తుతం స్థలాలు లేక తాత్కాలిక రేకుల షెడ్లు వేసుకొని జీవనం సాగిస్తున్నాం. టిడిపి అధికారంలోకి వచ్చాక మాకు ఇళ్లస్థలాలు, ఇళ్లు కేటాయించండి. మా గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపండి. మాచాపురంలో ఎస్సీలు, బిసిలు, కాపులకు శ్మశానవాటిక లేదు. టిడిపి ప్రభుత్వం వచ్చాకు మా కులాలకు విడివిడిగా స్థలాలు కేటాయించండి. గురురాఘవేంద్ర చిలకలడోన ఎత్తిపోతల పథకం కింద సాగయ్యే 4,500 ఎకరాల్లో మాచాపురం గ్రామ పొలాలు కూడా ఉన్నాయి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ ఫుట్ బాల్ ఒక మీటరు ఎత్తులో నిర్మించడం వల్ల పంప్ హౌస్ కు నీరు సరిగా అందడం లేదు. మాచాపురం ఎస్సీ కాలనీలో తాగునీటి కుళాయిల్లో నీరు గతంలో సరిపడా వచ్చేది.గత నాలుగేళ్లుగా తాగునీటి సమస్య తీవ్రమైంది. ఎస్సీ కాలనీలో ఇంతవరకు ఎవరికీ ఇంటి స్థలాలు ఇవ్వలేదు. టిడిపి ప్రభుత్వం వచ్చాక ఎస్సీలకు ప్లాట్లు, కాలనీకి తాగునీరు అందించండి.
యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ….
టిడిపి అధికారంలోకి వచ్చాక నడకైరవాడి, మాచాపురం గ్రామాల్లో అర్హులైన వారందరికీ ఇళ్లస్థలాలు, ఇళ్లు కేటాయిస్తాం. మాచాపురం వాసులు కోరిన విధంగా శ్మశాన వాటికలకు స్థలం కేటాయిస్తాం. చిలకలడోన లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ సమస్యను పరిష్కరించి సజావుగా నీరందేలా చేస్తాం. ఎస్సీ కాలనీతోపాటు గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం.
యువనేతను కలిసిన నందవరం రైతులు, దళితులు
ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం రైతులు, దళితులు యువనేత నారా లోకేష్ ను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. గత ప్రభుత్వంలో టెండర్లు పూర్తయిన ఆర్ డిఎస్ కుడికాల్వ పనులను ప్రారంభించాలి. కర్నాటకలో తుంగభద్ర డ్యామ్ నుంచి ఎల్ఎల్ సి కాల్వకు అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు వేసి నీరు రప్పించాలి. కల్తీ విత్తనాలను అరికట్టి, ఎరువుల ధరలు తగ్గించాలి. వైసిపి ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు బిగిస్తున్న మీటర్లను రద్దుచేయాలి. ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలి. గత ప్రభుత్వ హయాంలో నందవరం ఎస్సీ కాలనీలో 218మంది దళితులకు 3సెంట్ల చొప్పున మంజూరుచేసిన పట్టాలను వైసిపి ప్రభుత్వం రద్దుచేసింది. రద్దుచేసిన పట్టాలను పునరుద్దరించండి. 70సంవత్సరాలుగా ఎస్సీకాలనీ ప్రజలకు శ్మశానవాటిక లేదు. కాలనీలో సిసి రోడ్లు లేవు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం, చర్చి నిర్మాణానికి సహకారం అందించండి. గతంలో ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ. 5లక్షలు, సహజ మరణానికి 2లక్షలు ఇచ్చేవారు. వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన ఆ పథకాన్ని కొనసాగించండి. గత ప్రభుత్వం దళిత ఆడబిడ్డల,కు పెళ్లికానుక కింద రూ.50వేలు ఇచ్చేది, వైసిపి ప్రభుత్వం వచ్చాక రద్దుచేసిన ఆ పథకాన్ని కొనసాగించండి.
యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ….
రాయలసీమలో గత ప్రభుత్వంలో నిర్మించినవి తప్ప ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా వైసిపి ప్రభుత్వం చేపట్టలేదు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్డీఎస్ కుడికాల్వ పనులు ప్రారంభిస్తాం. గతంలో మాదిరిగా రైతులకు సబ్సిడీపై డ్రిప్స్ స్ప్రింకర్లను అందజేస్తాం. కల్తీవిత్తనాలపై ఉక్కుపాదం మోపుతాం, సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందజేస్తాం. మోటార్లకు మీటర్లతో రైతులకు జగన్ ఉరితాడు బిగించాలని చూస్తున్నాడు. టిడిపి ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దుచేస్తాం. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేసి రాయలసీమలో వలసలను నివారిస్తాం. నందవరం ఎస్సీకాలనీ దళితులకు ఇళ్లపట్టాలు, ఇళ్లు మంజూరు చేస్తాం. దళితులకోసం గత ప్రభుత్వం అమలుచేసిన పథకాలన్నీ కొనసాగిస్తాం. నందవరం ఎస్సీ శ్మశానవాటికకు స్థలం కేటాయిస్తాం. రైతులు, ఎస్సీలను మోసగించిన జగన్ కు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్దిచెప్పాలి.
Also, read this blog: Building Youth Futures with Yuvagalam’s Awareness
Tagged: #LokeshPadaYatra #Padayatra #YuvaGalamLokesh #YuvaGalam #NaraLokeshPadaYatra #NaraLokesh